రాములమ్మ దుబ్బాకలో పోటీ చేయనుందా ?

0
36
vijayashanthi may be contest from dubhaka

దుబ్బాక ఎం ఎల్ ఏ సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణంతో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దాంతో రాజకీయ పార్టీలు ఎవరికి వారు తమ ఆయుధాలను సిద్ధం చేసుకుంటూ రంగంలోకి దిగడానికి సిద్ధమైపోయారు. ఇక భారతీయ జనతా పార్టీ అయితే అందరికంటే ముందుంది ఈ విషయంలో. ఆ పార్టీ నాయకుడు రఘునందన్ రావు వారం రోజులుగా దుబ్బాకలో ఆత్మీయ సమ్మేళనం అంటూ ప్రచారం కూడా చేసుకుంటున్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేస్తుందని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేయడానికి పలువురు పోటీ పడుతున్నప్పటికి అందరికంటే లేడీ అమితాబ్ గా పేరు గాంచిన విజయశాంతి దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీకి దిగితే విజయం సాధించే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు పలువురు. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న విజయశాంతి గత ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని అనుకుంది కానీ చివరి నిమిషంలో తన ఆలోచన విరమించుకుంది. టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది దాంతో కేసీఆర్ మళ్లీ అధికారం చేపట్టారు. అయితే కేసీఆర్ ప్రభుత్వం పై తీవ్ర అసంతృప్తి నెలకొనడంతో ఈసారి కాంగ్రెస్ కు విజయావకాశాలు ఉంటాయని కానీ విజయశాంతి పోటీ చేస్తేనే విజయం సాధించవచ్చని అంటున్నారు. అయితే విజయశాంతి ఇందుకు ఒప్పుకుంటుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది.

టీఆర్ఎస్ నుండి ఎవరు పోటీ చేస్తారు అన్నది ఇంకా తేలలేదు కానీ సోలిపేట రామలింగారెడ్డి కుటుంబంలో ఒకరికి టికెట్ ఖాయమని తెలుస్తోంది. ఒకవేళ సోలిపేట కుటుంబానికి టికెట్ ఇవ్వకపోతే టీఆర్ఎస్ కు చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఆ సాహసం చేయకపోవచ్చు. బీజేపీ అభ్యర్థి గా రఘునందన్ రావు దాదాపుగా ఖాయమైపోయింది. ఇక తెలాల్సింది రాములమ్మ నిర్ణయం. విజయశాంతి పోటీ చేస్తే తప్పకుండా గట్టి పోటీ ఏర్పడటం ఖాయం. దుబ్బాక లో త్రిముఖ పోరు ఖాయమైపోయింది . ఇక అసలు విజేత ఎవరు అన్నది ఆ సమయాన్ని బట్టి , అభ్యర్థి ఇచ్చే తాయిలాలను బట్టి విజయం ఆధారపడనుంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి