టాలీవుడ్ లో విషాదం : జయప్రకాశ్ రెడ్డి కన్నుమూత

0
59
jaya prakash reddy no more tollywood

టాలీవుడ్ మూవీ న్యూస్,గుంటూరు- టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి గుండెపోటుతో మరణించాడు ఈరోజు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి గుంటూరు లోని తన స్వగృహంలో ఉంటున్నాడు జయప్రకాశ్ రెడ్డి. ఈరోజు ఉదయం బాత్ రూంకు వెళ్లిన జయప్రకాశ్ రెడ్డికి బాత్ రూంలోనే గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించాడు. జయప్రకాష్ రెడ్డి వయసు 74 సంవత్సరాలు. 1946 అక్టోబర్ 10 న కర్నూల్ జిల్లాలో జన్మించాడు జయప్రకాశ్ రెడ్డి. మొదటి నుండి జయప్రకాశ్ రెడ్డికి నాటకాలు అంటే వల్లమాలిన ప్రేమ దాంతో రంగస్థల నటుడిగా రాణించాడు.

ఒకవైపు నాటకాల్లో నటిస్తూనే సినిమాల్లో కూడా ప్రయత్నాలు చేసాడు. మొదట వెంకటేష్ హీరోగా నటించిన బ్రహ్మపుత్రుడు చిత్రంలో నటించాడు జయప్రకాశ్ రెడ్డి. అయితే నటుడిగా బ్రేక్ మాత్రం దక్కలేదు. నటుడిగా 1988 నుండి ట్రై చేస్తున్నా వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమించుకుందాం ….. రా చిత్రంతోనే బ్రేక్ దక్కింది జయప్రకాశ్ రెడ్డికి. ప్రేమించుకుందాం ….. రా చిత్రంలో రాయలసీమ స్లాంగ్ లో జయప్రకాశ్ రెడ్డి చెప్పిన డైలాగ్స్ విశేషంగా అలరించాయి దాంతో తెలుగునాట విలన్ గా సాలిడ్ బ్రేక్ దక్కింది. ఆ తర్వాత సమరసింహా రెడ్డి చిత్రంతో ఒక్కసారిగా ఊహించని స్టార్ డం అందుకున్నాడు జయప్రకాశ్ రెడ్డి. నరసింహ నాయుడు , చెన్నకేశవ రెడ్డి , సీతయ్య , జయం మనదేరా , గబ్బర్ సింగ్ , నాయక్ , టెంపర్ , రేసుగుర్రం , సరైనోడు తదితర సినిమాల్లో నటించాడు.

మొత్తంగా ఇన్నేళ్ల కెరీర్ లో 100 సినిమాలకు పైగా నటించాడు జయప్రకాష్ రెడ్డి. విలన్ గానే కాకుండా కమెడియన్ గా కూడా అదరగొట్టాడు తనదైన విలనిజంతో . ముఖ్యంగా నాయక్ సినిమాలో జయప్రకాశ్ రెడ్డి విలన్ గా నటిస్తూనే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. విలన్ గా , కమెడియన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. జయప్రకాశ్ రెడ్డి  మృతి పట్ల పలువురు హీరోలు , దర్శక నిర్మాతలు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి